Skip to main content

త్వరలో కొత్త వార్తలను మీరు ఇక్కడ చూడవచ్చు

జస్టిస్ యశ్వంత్ వర్మ వ్యవహారం లేవనెత్తుతున్న ప్రశ్నలేమిటి?

న్యాయవ్యవస్థకు నిప్పుపెట్టిన నగదు కట్టలు…: “ జస్టిస్ యశ్వంత్ వర్మ వ్యవహారం లేవనెత్తుతున్న ప్రశ్నలేమిటి? " బండి మొగిలి, న్యాయవాది,    వరంగల్, ఆగస్టు 16 (నవ తరంగాలు) : న్యాయవ్యవస్థకు నిప్పుపెట్టిన నగదు కట్టలు…    జస్టిస్ యశ్వంత్ వర్మ వ్యవహారం లేవనెత్తుతున్న ప్రశ్నలేమిటి?    న్యాయం చెప్పాల్సిన వ్యక్తి ఇంట్లోనే భారీగా కాలిపోయిన కరెన్సీ కట్టలు కనిపించాయనే ఆరోపణలు రావడం సాధారణ విషయం కాదు.    అది కూడా ఒక హైకోర్టు న్యాయమూర్తి అధికారిక నివాసంలో, అర్ధరాత్రి జరిగిన అగ్నిప్రమాదం అనంతరం స్టోర్‌రూమ్‌లో భారీ మొత్తంలో నగదు కనిపించిందనే విషయం దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించింది.    ఈ వ్యవహారం కేవలం ఒక న్యాయమూర్తికి సంబంధించిన వ్యక్తిగత వివాదంగా చూడాల్సిన అంశం కాదు. ఇది న్యాయవ్యవస్థ పారదర్శకత, న్యాయమూర్తుల జవాబుదారీతనం, అవినీతి నిరోధక వ్యవస్థలు, ప్రజాస్వామ్య సంస్థలపై ప్రజల విశ్వాసం వంటి అనేక కీలక ప్రశ్నలను ముందుకు తెచ్చింది.    2025 మార్చి 14 రాత్రి ఢిల్లీలో అప్పటి ఢిల్లీ హైకోర్టు న...

రాజకీయ పర్యటనలు రైతు నష్టాన్ని భర్తీ చేయలేవు.

దేశానికి అన్నం పెట్టే రైతు :
"నేడు రాజకీయ పార్టీల చేతుల్లో ఒక “ప్రచార సాధనం”గా మారిపోయాడు."
బండి మొగిలి,
న్యాయవాది,

  వరంగల్, మే 12 (నవ తరంగాలు) : రాజకీయాల మధ్య నలిగిపోతున్న జీవితం రైతుది.
⇒    దేశానికి అన్నం పెట్టే రైతు నేడు రాజకీయ పార్టీల చేతుల్లో ఒక “ప్రచార సాధనం”గా మారిపోయాడు. ఒకప్పుడు భూమిని తల్లిగా భావించి వ్యవసాయం చేసిన రైతు, ఇప్పుడు రాజకీయ హామీల మధ్య, రుణాల మధ్య, ప్రకటనల మధ్య తన అసలు స్వరూపాన్ని కోల్పోతున్నాడు. రైతు సమస్యలను పరిష్కరించాల్సిన ప్రభుత్వాలు, రాజకీయ పార్టీలు వాటినే పరస్పర విమర్శలకు ఆయుధాలుగా మార్చుకోవడం అత్యంత దురదృష్టకరం.
⇒    కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వాల మధ్య నెలకొనే రాజకీయ వైరుధ్యం చివరికి రైతుపైనే భారంగా పడుతోంది. ఒక ప్రభుత్వం పంట రుణమాఫీ చేస్తామని ప్రకటిస్తే, మరో ప్రభుత్వం అది పూర్తిగా అమలు కాలేదని విమర్శిస్తుంది. ఇంకొక పార్టీ, గత ప్రభుత్వాలు రైతుల పేరుతో వచ్చిన నిధులను రియల్ ఎస్టేట్ వ్యాపారులు, భూస్వాములకు మళ్లించాయని ఆరోపిస్తుంది. ఈ ఆరోపణలు, ప్రతిఆరోపణల మధ్య నష్టపోయేది మాత్రం నిజమైన రైతే.
⇒    రైతులకు నాణ్యమైన విత్తనాలు, ఎరువులు, పురుగుమందులు అందించడంలో ఏ ప్రభుత్వం కూడా పూర్తి స్థాయిలో విజయవంతం కాలేకపోయింది. ఫలితంగా నకిలీ విత్తనాలు, నాసిరకం పురుగుమందుల వల్ల రైతులు తీవ్ర నష్టాలను ఎదుర్కొంటున్నారు. పంట పెట్టుబడి కోసం రైతు అప్పులు చేస్తాడు, ప్రకృతి సహకరించకపోతే లేదా నాసిరకం ఉత్పత్తుల వల్ల పంట నష్టపోతే, ఆ భారాన్ని మోయాల్సింది రైతే.
⇒    ప్రభుత్వాలు రైతులకు సంవత్సరానికి ₹10,000 లేదా మరికొన్ని ఆర్థిక సహాయ పథకాలు ఇస్తూ “రైతు సంక్షేమం” పేరుతో ప్రచారం చేసుకుంటున్నాయి. కానీ ఆ డబ్బుతో రైతు జీవితంలో శాశ్వత మార్పు వస్తుందా అనే ప్రశ్నకు సమాధానం లేదు. రైతును నిజంగా బలోపేతం చేసే విధానాలు,గిట్టుబాటు ధరలు, సాగు ఖర్చుల నియంత్రణ, నాణ్యమైన మార్కెట్ వ్యవస్థ, పంటల భద్రత — ఇవే అసలు అవసరం. కానీ రాజకీయ పార్టీలకు రైతు సంక్షేమం కన్నా రైతు ఓటు ఎక్కువ ముఖ్యమైపోయింది.
⇒    అకాల వర్షాలు, కరువు, వరదలు వంటి ప్రకృతి విపత్తులు వచ్చినప్పుడు రైతు పరిస్థితి మరింత దయనీయంగా మారుతోంది. కళ్లముందే పంట తడిసి నష్టపోతే, అధికార పార్టీని విమర్శిస్తూ ప్రతిపక్ష పార్టీలు “పరామర్శ యాత్రలు”, “రైతు సంగ్రామ యాత్రలు” నిర్వహిస్తాయి. కానీ ఆ రాజకీయ పర్యటనలు రైతు నష్టాన్ని భర్తీ చేయలేవు. పంట చేతికి వచ్చే సమయంలో జరిగిన నష్టాన్ని ఎవరు భరిస్తారు? రైతు చేసిన అప్పులు ఎవరు తీర్చిస్తారు? ఇవే అసలు ప్రశ్నలు.
⇒    పంటల బీమా పథకం కూడా చాలా సందర్భాల్లో పేరుకే పరిమితమైపోయింది. రైతులకు బీమా సొమ్ము సకాలంలో అందకపోవడం, క్లెయిమ్ ప్రక్రియ క్లిష్టంగా ఉండటం వల్ల రైతు నష్టపోయినప్పుడు రక్షణ లేకుండా పోతుంది. రైతు కోసం ఉన్న పథకాలు కాగితాలకే పరిమితమైతే, వాటి ఉద్దేశ్యం ఏమిటి.?
⇒    ఇంకా బాధాకరమైన విషయం ఏమిటంటే, రైతులు కూడా రాజకీయ పార్టీలకు అనుబంధంగా మారిపోతున్నారు. ఒక పార్టీ రైతు డిక్లరేషన్ ప్రకటిస్తే, మరో పార్టీ రైతు యాత్రలు చేపడుతుంది. కానీ అధికారంలోకి వచ్చిన తర్వాత పరిస్థితి మాత్రం మారడం లేదు. రైతు సమస్యలను పరిష్కరించే స్థిరమైన విధానాల కంటే, రాజకీయ లాభనష్టాలే ముఖ్యమవుతున్నాయి.
⇒    రైతు దేశ ఆర్థిక వ్యవస్థకు వెన్నెముక. అతన్ని ఓటు బ్యాంక్‌గా కాకుండా ఉత్పత్తిదారుడిగా, దేశ నిర్మాతగా చూడాలి. రైతు సంక్షేమం అనేది రాజకీయ ప్రచార అంశం కాకూడదు. అది ప్రభుత్వాల ప్రాథమిక బాధ్యత కావాలి. రైతు బాగుపడితేనే దేశం బాగుపడుతుంది. రైతు కష్టాన్ని అర్థం చేసుకుని, రాజకీయాలకు అతీతంగా వ్యవసాయాన్ని బలోపేతం చేసే విధానాలు అమలు చేసినప్పుడే నిజమైన మార్పు సాధ్యమవుతుంది.
మిత్రులారా....? మీరేమంటారు....!
****************************
బండి మొగిలి,
న్యాయవాది,
వరంగల్,
9989602566.

Comments