Skip to main content

త్వరలో కొత్త వార్తలను మీరు ఇక్కడ చూడవచ్చు

జస్టిస్ యశ్వంత్ వర్మ వ్యవహారం లేవనెత్తుతున్న ప్రశ్నలేమిటి?

న్యాయవ్యవస్థకు నిప్పుపెట్టిన నగదు కట్టలు…: “ జస్టిస్ యశ్వంత్ వర్మ వ్యవహారం లేవనెత్తుతున్న ప్రశ్నలేమిటి? " బండి మొగిలి, న్యాయవాది,    వరంగల్, ఆగస్టు 16 (నవ తరంగాలు) : న్యాయవ్యవస్థకు నిప్పుపెట్టిన నగదు కట్టలు…    జస్టిస్ యశ్వంత్ వర్మ వ్యవహారం లేవనెత్తుతున్న ప్రశ్నలేమిటి?    న్యాయం చెప్పాల్సిన వ్యక్తి ఇంట్లోనే భారీగా కాలిపోయిన కరెన్సీ కట్టలు కనిపించాయనే ఆరోపణలు రావడం సాధారణ విషయం కాదు.    అది కూడా ఒక హైకోర్టు న్యాయమూర్తి అధికారిక నివాసంలో, అర్ధరాత్రి జరిగిన అగ్నిప్రమాదం అనంతరం స్టోర్‌రూమ్‌లో భారీ మొత్తంలో నగదు కనిపించిందనే విషయం దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించింది.    ఈ వ్యవహారం కేవలం ఒక న్యాయమూర్తికి సంబంధించిన వ్యక్తిగత వివాదంగా చూడాల్సిన అంశం కాదు. ఇది న్యాయవ్యవస్థ పారదర్శకత, న్యాయమూర్తుల జవాబుదారీతనం, అవినీతి నిరోధక వ్యవస్థలు, ప్రజాస్వామ్య సంస్థలపై ప్రజల విశ్వాసం వంటి అనేక కీలక ప్రశ్నలను ముందుకు తెచ్చింది.    2025 మార్చి 14 రాత్రి ఢిల్లీలో అప్పటి ఢిల్లీ హైకోర్టు న...

పార్లమెంటు సభ్యుల సంఖ్య పెంచితే సాధారణ ప్రజలకు తక్షణ ప్రయోజనం ఏమిటి

డిలిమిటేషన్ బిల్లు తీసుకురావడంలో అంత తొందరేమిటి?

    దేశంలో పెరుగుతున్న పేదరికం, నిరుద్యోగం, రైతు సంక్షోభం, ధరల పెరుగుదల, విద్యా-ఆరోగ్య రంగాల వంటి మౌలిక వసతులు పైన ప్రజల సమస్యలను పక్కనపెట్టి కేంద్ర ప్రభుత్వం డిలిమిటేషన్ (పార్లమెంటు నియోజకవర్గాల పునర్విభజన) అంశాన్ని ముందుకు తెస్తున్న తీరు ప్రజలు గమనించాల్సిన అవసరం ఉంది. దేశానికి కావలసింది ప్రజల జీవన ప్రమాణాల మెరుగుదల, కాని రాజకీయ లాభనష్టాల కోసం సీట్ల పునర్విభజన కాదని ప్రజలు అభిప్రాయపడుతున్నారు.
    ప్రస్తుతం పార్లమెంటులో ప్రజా సమస్యలపై ఎంత చిత్తశుద్ధితో చర్చ జరుగుతోందో అర్థం చేసుకోవాలంటే, దేశ ప్రధాని స్వయంగా “80 కోట్ల మంది ప్రజలకు ఉచిత బియ్యం పథకం అందిస్తున్నాం” అని చెప్పిన విషయాన్ని గుర్తు చేసుకోవాలి. అంటే దేశంలో ఒకవైపు 80 కోట్ల మంది ప్రజలు ప్రభుత్వ సహాయంపై ఆధారపడాల్సిన పరిస్థితి ఉంటే, మరోవైపు మాత్రం ఆర్థిక అసమానతలు తీవ్రంగా పెరుగుతున్నాయి. ఇది మన దేశ ఆర్థిక విధానాల వైఫల్యానికి నిదర్శనం కాదా అనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి.
    ఇలాంటి సమయంలో డిలిమిటేషన్ బిల్లు తీసుకురావడంలో అంత తొందరేమిటి?
    పార్లమెంటు సభ్యుల సంఖ్య పెంచితే సాధారణ ప్రజలకు తక్షణ ప్రయోజనం ఏమిటి?
    రైతుకు కనీస మద్దతు ధర పెరుగుతుందా?
    నిరుద్యోగ యువకులకు ఉద్యోగం వస్తుందా? పేద కుటుంబాలకు నాణ్యమైన వైద్యం, విద్య అందుతుందా?
    ఈ ప్రశ్నలకు సమాధానం చెప్పకుండా కేవలం రాజకీయ లెక్కలతో ముందుకు రావడం ప్రజాస్వామ్యా దురదృష్టం.
    దేశానికి స్వాతంత్య్రం వచ్చి దాదాపు ఎనభై సంవత్సరాలు కావస్తున్నా ఇంకా కోట్లాది మంది ప్రజలు పేదరికంలోనే జీవిస్తున్నారు. గ్రామీణ ప్రాంతాల్లో మౌలిక సదుపాయాల కొరత, పట్టణాల్లో నిరుద్యోగం, మధ్యతరగతి మీద పన్నుల భారం, రైతుల అప్పుల బాధ ఇలా నిత్యం పేద ప్రజలు తమ జీవితంలో కష్టాలు కొనసాగుతూనే ఉన్నాయి.
    ఇలాంటి పరిస్థితులకు బాధ్యులు ఎవరు...? అనే ప్రశ్నకు స్వతంత్ర దేశంలో ఇప్పటికీ సమాధానం లేని ప్రశ్న ప్రశ్నగానే మిగిలి ఉంది.
    ఇంకొకవైపు దేశ సంపద కొద్దిమంది కార్పొరేట్ వర్గాల చేతుల్లో కేంద్రీకృతమవుతోందని అనేక ఆర్థిక నివేదికలు సూచిస్తున్నాయి. దేశంలో అదాని మరియు అంబానీ వంటి పెద్ద పెద్ద పారిశ్రామిక వేత్తల ఆస్తులు అమాంతం పెరుగుతుండగా, సామాన్య ప్రజల కొనుగోలు శక్తి తగ్గిపోతోంది....!
    కొద్ది మంది సంపదలో 2శాతం ప్రజా సంక్షేమానికి వినియోగించినా ప్రభుత్వ పాఠశాలలు, ఆసుపత్రులు, ఉపాధి హామీ పథకాలు మరింత బలోపేతం చేయవచ్చు.!
    కాబట్టి మన దేశ పాలకులను ప్రజలు అడగాల్సిన ప్రశ్నలు పేదరిక నిర్మూలనకు మీ కార్యాచరణ ఏమిటి? నిరుద్యోగ సమస్యకు పరిష్కారం ఎక్కడ?
    రైతు ఆదాయం రెట్టింపు హామీ ఏమైంది? ప్రభుత్వ విద్య, వైద్యం ఎందుకు బలహీనపడుతున్నాయి? ఆర్థిక అసమానతలను తగ్గించేందుకు చర్యలు ఏవి?
    ప్రజల అసలు సమస్యలపై సమాధానం చెప్పకుండా, రాజకీయ ప్రయోజనాల కోసం తీసుకువచ్చే బిల్లులు అధికారాన్ని కాపాడుకునేందుకు చేసే రాజకీయాలకు మాత్రమే ఉపయోగపడతాయి. ప్రజాస్వామ్యంలో ప్రజల అవసరాలే మొదటి ప్రాధాన్యం కావాలి....!
    డిలిమిటేషన్ కంటే పేదరిక నిర్మూలన, ఉద్యోగాలు, విద్య, వైద్యం, ఆరోగ్యం, సమాన అవకాశాలే దేశానికి అత్యవసరం. అందుకోసం బుద్ధి జీవులుగా ప్రజల మౌలిక అవసరాల కోసం ఉద్యమిద్దాం...
    సామాజిక ఉద్యమాభి వందనాలతో...
****************************
బండి మొగిలి,
న్యాయవాది,
వరంగల్,
9989602566.

Comments