త్వరలో కొత్త వార్తలను మీరు ఇక్కడ చూడవచ్చు

జస్టిస్ యశ్వంత్ వర్మ వ్యవహారం లేవనెత్తుతున్న ప్రశ్నలేమిటి?

న్యాయవ్యవస్థకు నిప్పుపెట్టిన నగదు కట్టలు…:
“ జస్టిస్ యశ్వంత్ వర్మ వ్యవహారం లేవనెత్తుతున్న ప్రశ్నలేమిటి? "
బండి మొగిలి,
న్యాయవాది,

  వరంగల్, ఆగస్టు 16 (నవ తరంగాలు) : న్యాయవ్యవస్థకు నిప్పుపెట్టిన నగదు కట్టలు…
   జస్టిస్ యశ్వంత్ వర్మ వ్యవహారం లేవనెత్తుతున్న ప్రశ్నలేమిటి?
   న్యాయం చెప్పాల్సిన వ్యక్తి ఇంట్లోనే భారీగా కాలిపోయిన కరెన్సీ కట్టలు కనిపించాయనే ఆరోపణలు రావడం సాధారణ విషయం కాదు.
   అది కూడా ఒక హైకోర్టు న్యాయమూర్తి అధికారిక నివాసంలో, అర్ధరాత్రి జరిగిన అగ్నిప్రమాదం అనంతరం స్టోర్‌రూమ్‌లో భారీ మొత్తంలో నగదు కనిపించిందనే విషయం దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించింది.
   ఈ వ్యవహారం కేవలం ఒక న్యాయమూర్తికి సంబంధించిన వ్యక్తిగత వివాదంగా చూడాల్సిన అంశం కాదు. ఇది న్యాయవ్యవస్థ పారదర్శకత, న్యాయమూర్తుల జవాబుదారీతనం, అవినీతి నిరోధక వ్యవస్థలు, ప్రజాస్వామ్య సంస్థలపై ప్రజల విశ్వాసం వంటి అనేక కీలక ప్రశ్నలను ముందుకు తెచ్చింది.
   2025 మార్చి 14 రాత్రి ఢిల్లీలో అప్పటి ఢిల్లీ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ యశ్వంత్ వర్మ అధికారిక నివాసంలో అగ్నిప్రమాదం జరిగింది. అగ్నిమాపక సిబ్బంది అక్కడికి చేరుకుని మంటలను అదుపులోకి తెచ్చిన అనంతరం, నివాసంలోని ఒక స్టోర్‌రూమ్‌కు సంబంధించిన నగదు కట్టలపై తీవ్ర చర్చ మొదలైంది.
   ఈ సంఘటనకు సంబంధించిన వీడియోలు, నివేదికలు బయటకు రావడంతో దేశవ్యాప్తంగా అనేక సందేహాలు వ్యక్తమయ్యాయి.
   ఇక్కడ అంత పెద్ద మొత్తంలో నగదు అక్కడికి ఎలా వచ్చింది? ఎవరిది? ఎందుకు అక్కడ ఉంచారు? దాని మూలం ఏమిటి?
   ఒక సాధారణ పౌరుడి ఇంట్లో లెక్కలు చూపని భారీ మొత్తంలో నగదు కనిపిస్తే, దర్యాప్తు సంస్థలు అనేక ప్రశ్నలు అడుగుతాయి.
   అయితే అదే ప్రశ్న ఒక న్యాయమూర్తి అధికారిక నివాసానికి సంబంధించినప్పుడు మరింత తీవ్రమైన స్థాయిలో అడగాల్సిన అవసరం ఉంటుంది. ఎందుకంటే న్యాయమూర్తి కేవలం వ్యక్తి కాదు; ఆయన నిర్ణయాలు ప్రజల ఆస్తులు, హక్కులు, స్వేచ్ఛలు, జీవితాలు, ప్రభుత్వ నిర్ణయాలు, వ్యాపార వివాదాలు, నేర కేసులు వంటి అనేక అంశాలపై ప్రభావం చూపుతాయి.
   అందుకే న్యాయమూర్తి మీద అనుమానం వచ్చినప్పుడు దాన్ని వ్యక్తిగత విషయంగా పక్కన పెట్టడం ప్రజాస్వామ్యానికి ప్రమాదకరం.ఈ వ్యవహారంలో నగదు మొత్తంపై కూడా విభిన్న నివేదికలు వెలువడ్డాయి.
   కొన్ని నివేదికలు సుమారు ₹15 కోట్ల మేర నగదు ఉందని పేర్కొన్నాయి. అయితే నగదు మొత్తంపై ప్రారంభ దశలోనే వివిధ వాదనలు, వివరణలు వెలువడటంతో అనుమానాలు మరింత పెరిగాయి.
   జస్టిస్ వర్మ మాత్రం నగదు తనదికాదని, తనకు ప్రత్యక్ష సంబంధం లేదని వాదించారు. ఆయన విచారణ ప్రక్రియను కూడా సవాలు చేశారు.అయితే ఇక్కడ అసలు విషయం “జస్టిస్ వర్మ తప్పు చేశారా లేదా?” అనే ఒకే ప్రశ్నతో ముగిసిపోదు.అసలు ప్రశ్న ఏమిటంటే ఒక న్యాయమూర్తి అధికారిక నివాసంలో ఇంత పెద్ద మొత్తంలో నగదు కనిపించిందనే ఆరోపణ వచ్చినప్పుడు, దాని వెనుక ఉన్న పూర్తి నిజాన్ని ప్రజలకు తెలియజేయడం న్యాయమూర్తి బాధ్యత.
   న్యాయస్థానానికి వెళ్లే సామాన్య పౌరుడు తన వద్ద ఉన్న చివరి ఆశతో కోర్టు తలుపు తడతాడు. పోలీసులపై నమ్మకం లేకపోతే కోర్టును ఆశ్రయిస్తాడు. ప్రభుత్వ అధికారులు అన్యాయం చేశారని భావిస్తే న్యాయస్థానాన్ని ఆశ్రయిస్తాడు. తన ఆస్తి, ఉద్యోగం, స్వేచ్ఛ, హక్కులు ప్రమాదంలో పడితే న్యాయవ్యవస్థ వైపు చూస్తాడు.అలాంటి వ్యవస్థలో పనిచేసే న్యాయమూర్తులపై ప్రజలకు అనుమానం కూడా రాకుండా ఉండటం అత్యంత ముఖ్యమైన విషయం. ఒక న్యాయమూర్తి ఇంట్లో భారీగా నగదు కనిపించిందనే ఆరోపణ వచ్చినప్పుడు, ఆ అనుమానాన్ని నివృత్తి చేయాల్సిన బాధ్యత వ్యవస్థపైనే ఉంటుంది. విచారణ పారదర్శకంగా జరిగితేనే ప్రజలు నమ్ముతారు.
   మూడు సభ్యుల విచారణ కమిటీ ఎందుకు?
   ఈ వ్యవహారం తీవ్రత దృష్ట్యా న్యాయవ్యవస్థలో అంతర్గత విచారణ ప్రారంభమైంది. తరువాత పార్లమెంటరీ ప్రక్రియలో భాగంగా లోక్‌సభ స్పీకర్ ఏర్పాటు చేసిన మూడు సభ్యుల కమిటీకి ఈ వ్యవహారం వెళ్లింది. జస్టిస్ వర్మ ఆ కమిటీ ప్రక్రియను సవాలు చేస్తూ సుప్రీంకోర్టును ఆశ్రయించగా, సుప్రీంకోర్టు ఆ కమిటీ ఏర్పాటు విషయంలో చట్టపరమైన లోపం లేదని పేర్కొంటూ ఆయన పిటిషన్‌ను తిరస్కరించింది.
   అంటే ఈ వ్యవహారం ఒక దశలో వ్యక్తిగత ఆరోపణ నుంచి రాజ్యాంగబద్ధమైన జవాబుదారీతనం ప్రశ్నగా మారింది. ఎందుకంటే ఒక న్యాయమూర్తిపై వచ్చిన ఆరోపణలను విచారించేందుకు వ్యవస్థలోనే ఉన్న సంస్థలు ముందుకు రావడం, తరువాత పార్లమెంటరీ ప్రక్రియ ప్రారంభం కావడం న్యాయమూర్తులు కూడా చట్టానికి, రాజ్యాంగ వ్యవస్థకు అతీతులు కాదనే సూత్రాన్ని గుర్తు చేస్తుంది. 2026 ఏప్రిల్‌లో జస్టిస్ యశ్వంత్ వర్మ తన న్యాయ పదవికి రాజీనామా చేశారు. ఆ సమయంలో ఆయనపై పార్లమెంటరీ విచారణ ప్రక్రియ ముందుకు సాగుతోంది. రాజీనామా చేసిన తర్వాత విచారణ ప్రక్రియపై కూడా చట్టపరమైన, రాజ్యాంగపరమైన ప్రశ్నలు తలెత్తాయి. కానీ ఒక వ్యక్తి రాజీనామా చేయడం వల్ల ప్రజలకు వచ్చిన ప్రశ్నలు జవాబులు కావు.నగదు ఎవరిది? అనే ప్రశ్నకు సమాధానం కావాలి.ఆ నగదు అక్కడ ఎందుకు ఉంది?” అనే ప్రశ్నకు సమాధానం కావాలి.దాని మూలం ఏమిటి?” అనే ప్రశ్నకు సమాధానం కావాలి.ఆ సంఘటనపై మొదటి దశలో జరిగిన చర్యలు సరైనవేనా? అనే ప్రశ్నకు సమాధానం కావాలి.ఎవరైనా నేరం చేసి ఉంటే చట్టపరంగా ఏ చర్య తీసుకున్నారు? అనే ప్రశ్నకు సమాధానం కావాలి.ఇవి ప్రజాస్వామ్య సమాజంలో అడగాల్సిన సహజమైన ప్రశ్నలు. కమిటీ నివేదిక మరింత తీవ్రమైన ప్రశ్నలు లేవనెత్తింది.
   2026 ఆగస్టు 12న లోక్‌సభలో ఈ వ్యవహారానికి సంబంధించిన కమిటీ నివేదికను ప్రవేశపెట్టే ప్రక్రియ ముందుకు వచ్చింది. తాజాగా వచ్చిన నివేదికల ప్రకారం, లోక్‌సభ స్పీకర్ నియమించిన విచారణ కమిటీ జస్టిస్ వర్మపై వచ్చిన ఆరోపణల్లో తీవ్ర దుష్ప్రవర్తనకు సంబంధించిన అంశాలను నిర్ధారించినట్లు పేర్కొంది. నగదు లభించడం, సంబంధిత సాక్ష్యాల నిర్వహణపై ప్రశ్నలు, ఆయన ఇచ్చిన వివరణ తృప్తికరంగా లేదన్న అంశాలు కమిటీ పరిశీలనలోకి వచ్చాయి. జస్టిస్ వర్మ నేరం చేశారా లేదా అన్న తుది నిర్ణయం చట్టపరమైన ప్రక్రియలో తేలాల్సిందే. కానీ ఆయన అధికారిక నివాసంలో నగదు కట్టలు కనిపించాయనే ఆరోపణలు, వాటిపై జరిగిన విచారణ, కమిటీ నిర్ధారణలు, చివరకు ఆయన రాజీనామా—ఇవన్నీ భారత న్యాయవ్యవస్థలో జవాబుదారీతనం, పారదర్శకతపై ఒక పెద్ద చర్చకు కారణమయ్యాయి.
   ప్రజాస్వామ్యంలో ప్రశ్నించడం నేరం కాదు.
   ప్రశ్నించాలి…నిజాన్ని వెలికితీయాలి…
   ఎవరైనా సరే చట్టం ముందు జవాబుదారీగా ఉండే వ్యవస్థను నిర్మించాలి.
మిత్రులారా....? మీరేమంటారు....!
****************************
బండి మొగిలి,
న్యాయవాది,
వరంగల్,
9989602566.

Comments