మహిళా సాధికారత, రాజకీయ నినాదాల కోసమా ?
లేక నిజమైన న్యాయం కోసమా ?
బండి మొగిలి,
న్యాయవాది,
వరంగల్,ఏప్రిల్ 22 (నవ తరంగాలు): దేశంలో మహిళల భద్రత, గౌరవం, సమాన హక్కుల గురించి ప్రతి రాజకీయ పార్టీ మాట్లాడుతుంది. కానీ వాస్తవ పరిస్థితులు అందుకు భిన్నంగా ఉన్నాయి. మహిళలపై హింస, లైంగిక దాడులు, కుల ఆధారిత దాడులు, అధికార దుర్వినియోగం వంటి ఘటనలు దేశవ్యాప్తంగా తరచూ వెలుగులోకి వస్తున్నాయి. ఇలాంటి సందర్భాల్లో పాలక వ్యవస్థ స్పందన, పోలీసుల వైఖరి, రాజకీయ నాయకుల మౌనం ప్రజల్లో తీవ్రమైన అనుమానాలు కలిగిస్తోంది.
న్యాయం ఆలస్యం అయితే అది అన్యాయమే అవుతుంది.
మహిళలపై దాడులు జరిగినప్పుడు బాధితురాలికి తక్షణ రక్షణ, నిష్పక్షపాత విచారణ, వేగవంతమైన న్యాయం జరగాలి. కానీ అనేక కేసుల్లో మొదట బాధితురాలినే ప్రశ్నించే పరిస్థితి కనిపిస్తుంది. బీజేపీ అధికార పార్టీకి చెందిన నాయకులు పేర్లు వస్తే విచారణ మందగించడం, పోలీసులు నిర్లక్ష్యం చేయడం, సాక్ష్యాలు దాచిపెట్టడం వంటి ఆరోపణలు వినిపిస్తుంటాయి. ఇది ప్రజాస్వామ్యానికి ప్రమాదకరం.
రాజకీయ రంగు చూస్తే న్యాయం చనిపోతుంది.
మహిళలపై దాడి జరిగినప్పుడు బాధితురాలి కులం, మతం, ప్రాంతం, రాజకీయ నేపథ్యం చూసి స్పందిస్తే అది న్యాయం కాదు. ఒక రాష్ట్రంలో జరిగిన ఘటనపై తీవ్రంగా మాట్లాడి, మరో రాష్ట్రంలో జరిగిన ఘటనపై మౌనం పాటించడం ద్వంద్వ వైఖరి. మహిళా గౌరవం పార్టీ ఆధారంగా మారదు. బాధితురాలు ఎక్కడి వారైనా, ఏ వర్గానికి చెందిన వారైనా సమాన స్పందన రావాలి.
మహిళా బిల్లు మాత్రమే సరిపోదు, మహిళలకు శాసనసభల్లో, పార్లమెంటులో ప్రాతినిధ్యం పెరగడం అవసరం. మహిళా రిజర్వేషన్ వంటి చర్యలు స్వాగతించదగ్గవే. కానీ అదే సమయంలో గ్రామస్థాయి నుంచి జాతీయస్థాయి వరకు మహిళలు భయంలేకుండా జీవించే పరిస్థితులు కల్పించాలి.
అందుకోసం వేగవంతమైన న్యాయవ్యవస్థ మహిళా పోలీస్ స్టేషన్ల బలోపేతం బాధితులకు ఉచిత న్యాయసహాయం సాక్షుల రక్షణ ఉద్యోగ, విద్యా అవకాశాల్లో సమాన హక్కులు, మత, లింగ వివక్షపై కఠిన చర్యలు ఇవి లేకుండా కేవలం బిల్లులు తెచ్చినా పూర్తి సాధికారత రాదు.
క్రీడా రంగం నుంచి గాలి వీధి వరకు భద్రత అవసరం దేశానికి పతకాలు తెచ్చిన మహిళా క్రీడాకారిణులు కూడా లైంగిక వేధింపులపై బహిరంగంగా మాట్లాడాల్సిన పరిస్థితి రావడం బాధాకరం.
ఉన్నావ్ కేసు:
ఉత్తరప్రదేశ్‌లో బీజేపీ ఎమ్మెల్యేపై యువతి అత్యాచారం ఆరోపణలు చేయగా, న్యాయం కోసం పోరాడిన బాధిత కుటుంబం తీవ్ర ఒత్తిడులు ఎదుర్కొంది. తర్వాత బాధితురాలు ప్రయాణిస్తున్న వాహనంపై దాడి జరిగి కేసు దేశవ్యాప్తంగా చర్చనీయాంశమైంది.
హత్రాస్ ఘటన:
దళిత యువతిపై సామూహిక అత్యాచారం, దారుణ హత్య దేశాన్ని కలచివేసింది. కుటుంబ అనుమతి లేకుండా రాత్రికి రాత్రే అంత్యక్రియలు జరపడం పోలీసుల పాత్రపై ప్రశ్నలు లేవనెత్తింది.
మణిపూర్ మహిళల అవమానకర ఘటన:
జాతి ఘర్షణల సమయంలో మహిళలను నగ్నంగా ఊరేగించిన వీడియో దేశాన్ని షాక్‌కు గురి చేసింది. మహిళా భద్రతపై ప్రభుత్వ వైఫల్యంపై తీవ్ర విమర్శలు వచ్చాయి.
మహిళా కుస్తీ క్రీడాకారిణుల నిరసన:
అంతర్జాతీయ పతక విజేతలు తమపై లైంగిక వేధింపుల ఆరోపణలు చేస్తూ ఢిల్లీలో నిరసనకు దిగడం దేశ క్రీడారంగంలో పెద్ద సంచలనం సృష్టించింది.
న్యాయం కోసం పోరాడిన వారిపై దాడులు:
కొన్ని కేసుల్లో బాధితులకు మద్దతుగా నిలిచిన కుటుంబ సభ్యులు, న్యాయవాదులు, సాక్షులు కూడా బెదిరింపులు, దాడులు ఎదుర్కొన్నారనే ఆరోపణలు వచ్చాయి.
మహిళా సాధికారత ఓటు రాజకీయాల నినాదం కాదు. అది రాజ్యాంగబద్ధ హక్కు. మహిళా బిల్లు తీసుకురావడం ఒక అడుగు అయితే, మహిళకు భద్రత, న్యాయం, గౌరవం కల్పించడం అసలు లక్ష్యం కావాలి. దేశం అభివృద్ధి చెందిందని చెప్పాలంటే రోడ్లు, భవనాలు చాలవు—మహిళ భయంలేకుండా జీవించే సమాజం కావాలి.
నినాదాలు కాదు… న్యాయం కావాలి.
ప్రచారం కాదు… పరిరక్షణ కావాలి. సమాన హక్కులు కావాలి.
మిత్రులారా....? మీరేమంటారు....!
****************************
బండి మొగిలి,
న్యాయవాది,
వరంగల్,
9989602566.
Comments
Post a Comment