Skip to main content

త్వరలో కొత్త వార్తలను మీరు ఇక్కడ చూడవచ్చు

జస్టిస్ యశ్వంత్ వర్మ వ్యవహారం లేవనెత్తుతున్న ప్రశ్నలేమిటి?

న్యాయవ్యవస్థకు నిప్పుపెట్టిన నగదు కట్టలు…: “ జస్టిస్ యశ్వంత్ వర్మ వ్యవహారం లేవనెత్తుతున్న ప్రశ్నలేమిటి? " బండి మొగిలి, న్యాయవాది,    వరంగల్, ఆగస్టు 16 (నవ తరంగాలు) : న్యాయవ్యవస్థకు నిప్పుపెట్టిన నగదు కట్టలు…    జస్టిస్ యశ్వంత్ వర్మ వ్యవహారం లేవనెత్తుతున్న ప్రశ్నలేమిటి?    న్యాయం చెప్పాల్సిన వ్యక్తి ఇంట్లోనే భారీగా కాలిపోయిన కరెన్సీ కట్టలు కనిపించాయనే ఆరోపణలు రావడం సాధారణ విషయం కాదు.    అది కూడా ఒక హైకోర్టు న్యాయమూర్తి అధికారిక నివాసంలో, అర్ధరాత్రి జరిగిన అగ్నిప్రమాదం అనంతరం స్టోర్‌రూమ్‌లో భారీ మొత్తంలో నగదు కనిపించిందనే విషయం దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించింది.    ఈ వ్యవహారం కేవలం ఒక న్యాయమూర్తికి సంబంధించిన వ్యక్తిగత వివాదంగా చూడాల్సిన అంశం కాదు. ఇది న్యాయవ్యవస్థ పారదర్శకత, న్యాయమూర్తుల జవాబుదారీతనం, అవినీతి నిరోధక వ్యవస్థలు, ప్రజాస్వామ్య సంస్థలపై ప్రజల విశ్వాసం వంటి అనేక కీలక ప్రశ్నలను ముందుకు తెచ్చింది.    2025 మార్చి 14 రాత్రి ఢిల్లీలో అప్పటి ఢిల్లీ హైకోర్టు న...

శుభ్రమైన ఆహారం దొరకని ఈ దేశంలో జీవించేదెట్లా....! నిపుణుల సలహాలు, సూచనలు, పట్టించుకోని పాలకులు....!

   ఆరోగ్యమే సౌభాగ్యం’ అన్నారు పెద్దలు.
   మంచి ఆరోగ్యానికి పోషకాహారం ఎంతైనా అవసరం.
   అయితే, మన దేశంలో అత్యధికశాతం మంది ప్రజలకు సరైన పౌష్టికాహారం లభించడం లేదు.
   పుష్టికరమైన ఆహారం కాదు కదా, ఆకలి తీర్చుకునేందుకు అవసరమైన సాధారణ ఆహారం కూడా ఎంతోమందికి కొరతగానే ఉంది. పస్తులతో బాధపడేవారు, అర్ధాకలితో అలమటించేవారు దేశంలో కోకొల్లలుగానే ఉంటున్నారు.
   ప్రపంచంలోనే మూడవ అతిపెద్ద ఆర్ధికవ్యవస్థగా మనదేశం రూపుదిద్దుకోబోతోందని పాలకులు గొప్పగా చెప్పుకుంటున్నా, మరోవైపు దేశంలో నిరుపేదలు, అసహాయుల పరిస్థితి దయనీయంగానే ఉంటోంది.
   ఏళ్ల తరబడిగా ఆ దుస్థితిలో పెద్దగా మార్పేమీ ఉండడం లేదు.
   ఒకవైపు పేదరికం, మరోవైపు నిరుద్యోగం, ఇంకోవైపు ఆర్థిక అసమానతలు దేశాన్ని కుంగదీస్తూనే ఉన్నాయి.
   దాదాపు 70 శాతం మంది ప్రజలకు సరైన ఆహారం ఉండడం లేదని, దీంతో దేశంలో ఏటా దాదాపు 17 లక్షల మంది వరకు మృత్యువాత పడుతున్నారని కూడా అధ్యయనాలు స్పష్టం చేస్తూనే ఉన్నాయి.
   ఇలాంటి వాస్తవ పరిస్థితులను పరిశీలించి, ఆచరణాత్మకమైన విధానాలతో పేదరికం నుంచి దేశాన్ని గట్టెక్కించాల్సిన ప్రభుత్వాలు నిమ్మకు నీరెత్తినట్లు ఉండడం విచారకరం.
   సరైన పోషకాహారాలు లేక చిన్నారులు, యువత సైతం బక్కచిక్కిపోతున్న దుస్థితి మన పాలకులకు కనిపించకపోవడం బాధాకరం.
   కేవలం పౌష్టికాహార లోపంతో ఏటా లక్షలాదిమంది చిన్నారులు కూడా కన్ను మూస్తున్నా ప్రభుత్వాల్లో చలనం ఉండడం లేదు.
   పాశ్చాత్య వంటకాల మోజులో, ఎంతో ఆరోగ్యకరమైన భారతీయ ఆహారపుటలవాట్లు మట్టికొట్టుకుపోతున్నాయి.
   పరిశుభ్రమైన ఆహారం అన్నదే కనిపించడం లేదు. ఎక్కడ చూసినా కల్తీయే రాజ్యమేలుతోంది.
   ప్రజారోగ్యాన్ని పట్టించుకోకుండా ధనార్జనే ధ్యేయంగా వ్యాపారులు కల్తీ సరుకులను యధేచ్ఛగా అమ్మేస్తున్నారు.
   రుచీపచీ లేని పదార్ధాలు, నాసిరకం వంటకాలను తింటూ జనం రోగాల పాలవుతున్నారు. కల్తీ పదార్ధాలు తినడం వల్ల ప్రజారోగ్యానికి ఎంత ముప్పో తెలిసినా వాటిని నియంత్రించడానికి పాలకులు తీసుకుంటున్న చర్యలేమీ ఉండడం లేదు.
   ఫలితంగా, చిన్నవయసులోనే మదుమేహం (షుగర్‌ వ్యాధి), గుండెజబ్బులు, ఊబకాయాల వంటి సమస్యలు ప్రజలను చుట్టుముడుతున్నాయి.
   అనేక రకాల క్యాన్సర్లు ముంచుకొచ్చి ప్రాణాలు తీస్తు న్నాయి. పంటపొలాల్లో రసాయన ఎరువులు విపరీతంగా వాడుతుండడం వల్ల కూడా క్యాన్సర్‌ జబ్బులు పెరుగుతున్నాయని, ఈ పరిస్థితులు ఇలాగే కొనసాగితే భవిష్యత్తులో కాన్సర్‌ మరణాల సంఖ్య మరింతగా పెరుగుతుందనే నిపుణుల ఆందోళనను ఎవరూ పట్టించు కోవడం లేదు.
   మరోవైపు ప్రజలు నిత్యం వినియోగించుకునే ఆకుకూరలు, కాయగూరలకు సైతం రసాయనాలు విరివిగా వాడుతుండడం వ్యవసాయ ఉత్పత్తులపై వాటి వాడకం అధికంగా ఉండడం, నకిలీ పురుగుమందుల ప్రభావం వంటి వన్నీ ఆరోగ్యానికి ప్రమాదకరంగా పరిణమిస్తూనే ఉన్నాయి.
   ఎలాంటి ఇబ్బందిలేని సేంద్రీయ సాగు విధానాలకు ఆశించిన ప్రోత్సాహం ఉండడం లేదు.
   పంట పొలాలకు వాడే నీరు కూడా కలుషితంగానే ఉండడం, మురుగునీటి నీటిని శుద్ధి చేయ కుండానే పొలాలకు వాడుతుండడంతో వాటి ద్వారా పండు తున్న పంటలు, వ్యవసాయ ఉత్పత్తులు ప్రజారోగ్యానికి ప్రమాదకరంగా తయారవుతున్నాయని నిపుణులు ఎంతగా చెప్తున్నా పాలకుల చెవికెక్కడం లేదు.
   తాగునీరు కూడా కలుషితమై తద్వారా మరిన్ని వ్యాధులు ప్రజలకు సంక్రమిస్తు న్నాయి. పోషకాహార పదార్ధాలు లేని ఆహారం ఎంతగా తిన్నా ప్రయోజనం ఉండదు.
   అంతేకాదు, దేశంలో అడ్డూఅదుపూ లేకుండా పెరుగుతున్న నిత్యావసర సరుకుల ధరలు పేదా సాదాకే కాదు, కోట్లాదిమంది మధ్యతరగతి ప్రజలకు కూడా చుక్కలు చూపిస్తున్నాయి.
   అన్ని రకాల పంటల ఉత్పత్తులకు ధరలను నిర్ణయించి, రైతులకు గిట్టుబాటు కల్పించాలనే ఆలోచనే ప్రభుత్వాలకి ఉండడం లేదు. ఎన్ని కల్తీలు జరిగినా, మార్కెట్లో ఎన్ని మోసాలు జరిగినా, తాగే నీరు, తినే ఆహారం కలుషితమై ప్రజలు రోగాలు రొష్టులతో బాధలు పడుతున్నా ధరలను నియంత్రించేవారు లేరు. కల్తీలను అరికట్టే నాధులే లేరు.
   ప్రభుత్వాలు ఇకనైనా వీటిపై దృష్టిపెట్టి ప్రజలకు సరైన పౌష్టికాహారం అందించేందుకు పటిష్టమైన చర్యలు తీసు కోవాలి.
   సేంద్రీయ సాగువిధానాలు దేశవ్యాప్తంగా ముమ్మ రంగా జరిగేలా రైతాంగాన్ని ప్రోత్సహించాలి. తాగునీటి వసతులు, జలవనరులు కలుషితం కాకుండా కాపాడాలి.
   ఏదేమైనా, ప్రజా రోగ్యానికి శాపంగా పరిణమించిన పౌష్టికాహార లోపాన్ని నివారించేందుకు చిత్తశుద్ధితో చర్యలు తీసుకోవడం, ఆహార భద్రత కల్పించి ప్రజలకు సురక్షితమైన ఆహారాన్ని అందించడం ప్రభుత్వాల తక్షణ కర్తవ్యం!
******************************
బండి మొగిలి,
న్యాయవాది,
వరంగల్,
9989602566.

Comments